Sircilla: సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలు!
Sircilla: సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలు. హైదరాబాద్లో మంత్రి వివేక్, ప్రభుత్వ విప్ ఐలయ్యలను ఆహ్వానించిన నిర్వాహకులు.
Sircilla: సిరిసిల్లలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలు!
Sircilla: రాష్ట్రంలోనే తొలిసారిగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు హాజరై, జానపద కళాకారులకు మద్దతు తెలపాలని కోరుతూ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కన్వీనర్ ఎండీ సత్తార్ ఆధ్వర్యంలో నిర్వాహకులు బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర కార్మిక, బొగ్గు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలను వారి నివాసాల్లో కలిసి ఆహ్వానించారు.
నవంబర్ 3న సిరిసిల్లలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమానికి హాజరై తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎండీ సత్తార్ మాట్లాడుతూ.. జానపద కళాకారులు నేటి సినిమా రంగానికి దీటుగా తమ పాటల ద్వారా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ నూతన పాటలను రూపొందిస్తున్నారని తెలిపారు. అయితే పాటల నిర్మాణానికి పెట్టుబడులు అధికమవడంతో జానపద కళాకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సినిమా రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మాదిరిగానే జానపద కళారంగానికి కూడా ప్రోత్సాహం అందించేలా కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు హాజరై కళాకారులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై మంత్రి గడ్డం వివేక్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం రాజన్న సిరిసిల్ల జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని ప్రముఖ జానపద కళాకారులు, టెక్నీషియన్లు, నిర్మాతలు కలిసి ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు పెద్ద సంఖ్యలో కళాకారులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మంత్రులను కలిసిన వారిలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కన్వీనర్ ఎండీ సత్తార్, కోశాధికారి ఎర్రం గజ్వేల్ వేణు, ప్రచార కార్యదర్శి ఆకునూరి దేవయ్య, మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు తదితరులు పాల్గొన్నారు.




