Sircilla: ఉన్నత లక్ష్యాలతో పట్టుదలతో శ్రమించాలి

Sircilla: సిరిసిల్లలో సురక్షిత్ బచ్పన్ అభియాన్. బాలికల పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులపై అవగాహన కల్పించిన జడ్జి గడ్డం మేఘన.

KALEEM, SIRICILLA
Published on: 29 Oct 2026 6:17 PM IST
Sircilla
X

Sircilla: ఉన్నత లక్ష్యాలతో పట్టుదలతో శ్రమించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధించేందుకు పట్టుదలతో, క్రమశిక్షణతో నిరంతరం కృషి చేయాలని సిరిసిల్ల రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కుమారి గడ్డం మేఘన అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, బాలలపై లైంగిక నేరాల నిరోధం లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ సూచనలతో జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జడ్జి గడ్డం మేఘన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, పోక్సో చట్టం ద్వారా పిల్లలకు కల్పించిన రక్షణలను తెలుసుకోవాలని సూచించారు.

పిల్లలపై లైంగిక వేధింపులు లేదా అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు జరిగినప్పుడు భయపడకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇలాంటి ఘటనలను దాచిపెట్టకుండా చట్టప్రకారం సమాచారం అందించాలని, బాధిత పిల్లలకు తక్షణ రక్షణ, న్యాయ సహాయం అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

బాధిత పిల్లల వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతూ వారికి మానసిక ధైర్యం, భరోసా కల్పించాలని సూచించారు. బాలలపై లైంగిక నేరాల నిరోధానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం. తిరుపతి, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, న్యాయవాదులు ఆడెపు వేణు, కళ్యాణి, కుంట శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA