Sircilla: ముందే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులపై సీఎం ప్రకటన చేయాలి

Sircilla: సిరిసిల్ల పర్యటనలోపు మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ డిమాండ్.

KALEEM, SIRICILLA
Published on: 28 Sept 2026 4:32 PM IST
Sircilla
X

Sircilla: ముందే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులపై సీఎం ప్రకటన చేయాలి

సిరిసిల్ల: 2019–2024 మధ్య గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా చైర్మన్ గజ్జెల దేవరాజ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. సెప్టెంబర్ 30న సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనకు వచ్చేలోపు మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

గ్రామాల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, వివిధ కుల సంఘాల భవనాలు, మహిళా సంఘాల భవనాలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, గ్రామపంచాయతీ ట్రాక్టర్లు, చెత్త సేకరణ పరికరాలు, ట్యాంకర్లు తదితర ప్రజా అవసరాలకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని గజ్జెల దేవరాజ్ కోరారు. 2026 జూన్‌లో కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎంత మొత్తం చెల్లించారు, ఇంకా ఎంత బకాయి ఉందనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.

మాజీ సర్పంచుల బిల్లులు పూర్తిగా ఎప్పుడు చెల్లిస్తారు, ఇంకా ఎంత మొత్తం బకాయి ఉంది, జిల్లా వారీగా, మండలాల వారీగా బకాయిల వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాజీ సర్పంచుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఎప్పుడు ప్రకటిస్తారో స్పష్టం చేయాలని కోరారు.

కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల మొత్తం ఎంత, వాటిని ఎప్పటిలోగా పూర్తిగా చెల్లిస్తారో ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. జూన్ 2026లో బిల్లులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు ఎంత మొత్తం విడుదల చేశారో, ఇంకా ఎంత బకాయి ఉందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమకారుల హామీలపై స్పష్టత ఇవ్వాలి

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని గజ్జెల దేవరాజ్ కోరారు. 2023 కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణ వంటి హామీలతో పాటు తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేల గౌరవ పింఛన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్న అంశాలను గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం హామీని ఎప్పుడు అమలు చేస్తారు, ఉద్యమకారులకు అధికారిక గుర్తింపు, ఐడీ కార్డుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో వెల్లడించాలని కోరారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేల గౌరవ పింఛన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అనే హామీల అమలు పరిస్థితిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు.

సెప్టెంబర్ 30న సిరిసిల్ల సభా వేదికగా మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల విడుదలకు సంబంధించి స్పష్టమైన తేదీని ముఖ్యమంత్రి ప్రకటించాలని గజ్జెల దేవరాజ్ కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కూడా స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితిలో ఇక కాలయాపన చేయకుండా ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని అన్నారు. సిరిసిల్లకు వచ్చే ముఖ్యమంత్రి ముందుగా పెండింగ్ బిల్లులపై స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆ తర్వాతే సభ నిర్వహించాలని గజ్జెల దేవరాజ్ కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ జేఏసీ జిల్లా గౌరవాధ్యక్షులు బుస వేణు, రాచర్ల వెంకన్న, మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపల్లి కరుణాకర్, మాజీ కౌన్సిలర్ పత్తిపాక పద్మశంకర్, మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతి, మాజీ జెడ్పిటిసి గుగులోతు రేణ, జేఏసీ రాష్ట్ర నాయకురాలు కర్నే లక్ష్మి, మడుగుల వనజ, ఎస్.కె. సికిందర్, తిరునరహరి భానుమూర్తి తదితర జేఏసీ ఉద్యమకారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA