Sircilla: ఆధునిక సాగు పద్ధతులపై రైతులు దృష్టి సారించాలి
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన కిసాన్ మేళాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని రైతు సంక్షేమంపై ప్రసంగించారు.
Sircilla: ఆధునిక సాగు పద్ధతులపై రైతులు దృష్టి సారించాలి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాలలో జిల్లా వ్యవసాయ శాఖ, ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్లు ముకుందరెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మేళాకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని, రూ.20,650 కోట్లతో 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన వ్యవసాయ సబ్సిడీలను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చామని, వ్యవసాయ రంగంలో సుమారు 37 రకాల సబ్సిడీ పరికరాలను రైతులకు అందించే కార్యక్రమం చేపట్టామని వివరించారు.
నకిలీ విత్తనాలను అరికట్టడంతో పాటు రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూనే రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
సాంప్రదాయ వరి సాగుతో పాటు ఆయిల్‌పామ్, మిర్చి, కూరగాయలు వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆది శ్రీనివాస్ సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో ఆదర్శ రైతులను ప్రోత్సహించి, వారి అనుభవాలను ఇతర రైతులకు చేరవేయాలని అన్నారు. పంట మార్పిడి, వాణిజ్య పంటల సాగుతో పాటు పాడి పరిశ్రమ, పశుసంపద అభివృద్ధి, చేపల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ధాన్యం శుద్ధి కోసం ఆధునిక ప్యాడీ క్లీనర్ యంత్రాలను సింగిల్ విండో, ఐకేపీ కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ధాన్యాన్ని శుభ్రపరిచి విక్రయించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. భూసారాన్ని కాపాడేందుకు వరి కొయ్యలను కాల్చకుండా పొలంలోనే సేంద్రియ ఎరువులుగా మార్చుకోవాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు క్షేత్రస్థాయిలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని కోరారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల బడ్జెట్లో రైతు సంబంధిత కార్యక్రమాలకు రూ.1.10 లక్షల కోట్లు కేటాయించిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు సంక్షేమంతో పాటు ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని రూ.5 లక్షల బీమా భరోసా పొందాలని సూచించారు. రైతు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి వ్యవసాయంతో పాటు ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక రంగాలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.




