Sircilla: ఆర్‌సెటి ఆధ్వర్యంలో ఉచిత సీసీ కెమెరా టెక్నీషియన్ శిక్షణ

Sircilla: సిరిసిల్లలో యూనియన్ బ్యాంక్ ఆర్‌సెటి ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుంచి ఉచిత సీసీ కెమెరా టెక్నీషియన్ శిక్షణ. ఉచిత వసతి, భోజనం మరియు సర్టిఫికెట్ అందజేత.

KALEEM, SIRICILLA
Published on: 23 Oct 2026 8:58 PM IST
Sircilla
X

Sircilla: ఆర్‌సెటి ఆధ్వర్యంలో ఉచిత సీసీ కెమెరా టెక్నీషియన్ శిక్షణ

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ యువతీ యువకులు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఉచిత సీసీ కెమెరా టెక్నీషియన్ శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణ అక్టోబర్ 27, 2026 నుంచి ప్రారంభం కానుంది.

ఈ కోర్సు 14 రోజుల పాటు కొనసాగనుండగా, ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తిగా ఉచితమని, అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

శిక్షణ అనంతరం స్వయం ఉపాధి ప్రారంభించేందుకు మార్గదర్శకత్వంతో పాటు, అర్హులైన వారికి బ్యాంకు రుణ సదుపాయం పొందేందుకు సహాయం అందిస్తారు. భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.

అర్హతలు, అవసరమైన పత్రాలు

19 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగి, పదో తరగతి ఉత్తీర్ణులై, రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఈ శిక్షణకు అర్హులు. దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి మెమో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలి.

శిక్షణ కేంద్రం చిరునామా: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI), ఇంటి నంబర్ 8-8-95, నెహ్రూ నగర్, యూబీఐ గోపాల్ నగర్ ఎదురుగా, సిరిసిల్ల.

స్వయం ఉపాధి పొందాలనే ఆసక్తి ఉన్న అర్హులైన గ్రామీణ యువతీ యువకులు, మహిళలు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ నిర్వాహకులు సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA