Sircilla: భూముల రీ సర్వేలో కచ్చితత్వం తప్పనిసరి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: భూ భారతి కింద జిల్లాలో చేపట్టే భూముల రీ సర్వేలో వివరాలను పకడ్బందీగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 8 Oct 2026 6:34 PM IST
Sircilla
X

Sircilla: భూముల రీ సర్వేలో కచ్చితత్వం తప్పనిసరి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల: జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి, క్షేత్రస్థాయిలో భూముల వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

భూ భారతి కింద భూముల రీ సర్వే ప్రక్రియపై డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, జీపీఓలు, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లకు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై రీ సర్వే ప్రక్రియపై అధికారులకు పలు సూచనలు చేశారు.

భూ భారతి కింద భూముల రీ సర్వే ఉద్దేశం, ప్రయోజనాలు, పాటించాల్సిన నిబంధనలు, సర్వే నిర్వహణ విధానంపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. జిల్లాలో రీ సర్వే కోసం మొత్తం 18 రోవర్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నియమించిన లైసెన్స్డ్ సర్వేయర్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.

రెవెన్యూ అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్ల బృందాలతో రీ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ప్రతి గ్రామంలో ముందుగా గ్రామసభ నిర్వహించి, రీ సర్వే ఉద్దేశం, ప్రయోజనాలు, మొత్తం ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే చేపట్టనున్న భూముల వివరాలను ముందుగానే గ్రామస్తులకు తెలియజేయాలని, జీపీఓ, పంచాయతీ కార్యదర్శి సైతం సర్వే సమయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ముందుగా గ్రామ సరిహద్దుల సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులకు సమాచారం అందించి, ఆయా శాఖల ప్రతినిధులు కూడా సర్వేలో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో భూముల వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితత్వంతో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

రీ సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA