Sircilla: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్
Sircilla: సిరిసిల్లలో ప్రథమ చికిత్స కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచన.
Sircilla: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ప్రథమ చికిత్స కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిరిసిల్ల పట్టణంలోని అంబికా క్లినిక్, వరసిద్ధి క్లినిక్ ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు లీల శిరీష ప్రైవేట్ ఆసుపత్రిని డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ప్రథమ చికిత్స కేంద్రాలు కేవలం ప్రథమ చికిత్స సేవలకే పరిమితం కావాలని, అక్కడ ఇంజెక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ (సెలైన్) ఇవ్వకూడదని, రోగులను పడకలపై ఉంచి చికిత్స అందించేలా బెడ్లు ఏర్పాటు చేయరాదని నిర్వాహకులకు స్పష్టం చేశారు.
లీల శిరీష ప్రైవేట్ ఆసుపత్రిలో రోగులకు అందించే సేవల ధరల జాబితాను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించాలని, పార్కింగ్ సదుపాయం, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రోగులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
స్కానింగ్ కేంద్రాల్లో పీసీపీఎన్‌డీటీ నిబంధనలు తప్పనిసరి
స్కానింగ్ కేంద్రాల తనిఖీల సందర్భంగా పీసీపీఎన్‌డీటీ (PCPNDT) చట్ట నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ప్రతి స్కానింగ్ కేంద్రం ఫారం-ఎఫ్ వివరాలను ప్రతిరోజూ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని, స్కానింగ్‌కు సంబంధించిన రిఫరల్ స్లిప్పులను కనీసం రెండేళ్ల పాటు భద్రపరచాలని ఆదేశించారు. చట్టానికి సంబంధించిన రికార్డుల పుస్తకాన్ని స్కానింగ్ గదిలో అందుబాటులో ఉంచాలని తెలిపారు.
లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమనే హెచ్చరిక బోర్డును వెయిటింగ్ హాల్‌తో పాటు స్కానింగ్ గదిలోనూ స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. పీసీపీఎన్‌డీటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను కూడా ఈ రెండు ప్రదేశాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.
జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు సంబంధిత చట్టాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలను పాటించాలని డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్ కొప్పు ప్రసాద్, డీపీఎంఓ దేవ్‌సింగ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




