Sircilla: నవంబర్ 25, 26న 'ఢిల్లీ చలో'.. ఈవీఎంల రద్దు!

Sircilla: సిరిసిల్ల కాంగ్రెస్ ఆఫీస్‌లో శరత్ మాట్లాడుతూ.. ఓటు హక్కు రక్షణకు నవంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగే ర్యాలీని గెలిపించాలని కోరారు.

KALEEM, SIRICILLA
Published on: 25 Oct 2026 7:01 PM IST
Sircilla
X

Sircilla: నవంబర్ 25, 26న 'ఢిల్లీ చలో'.. ఈవీఎంల రద్దు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఓటు హక్కును పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ ర్యాలీకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏఐసీసీ పరిశీలకుడు శరత్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని, నకిలీ ఓట్ల నమోదు, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని శరత్ ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలకు సంబంధించి పలు అవకతవకలు జరిగాయని పేర్కొంటూ, ఈ అంశాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని ఆయన వెల్లడించారు.

ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాలు, పట్టణాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలకు ఓటర్ల జాబితాలోని అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించి, తొలగించిన పేర్లు, కొత్తగా నమోదైన ఓట్ల వివరాలను తనిఖీ చేస్తామని వెల్లడించారు.

నవంబర్ 25, 26 తేదీల్లో ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు శరత్ తెలిపారు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ బలోపేతం కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి మీడియా సహకరించాలని శరత్ కోరారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. నవంబర్ 1న జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA