Sircilla: సిరిసిల్లలో చండ్ర పుల్లారెడ్డి 42వ వర్ధంతి సభ!
Sircilla: సిరిసిల్లలో కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 42వ వర్ధంతి సభ జరిగింది. ప్రజా హక్కుల పరిరక్షణకు పోరాటమే ఏకైక మార్గమని సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.
Sircilla: సిరిసిల్లలో చండ్ర పుల్లారెడ్డి 42వ వర్ధంతి సభ!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 42వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఏఐఎఫ్‌టీయూ న్యూ జిల్లా కార్యాలయ ఆవరణలో సీపీఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. అనంతరం శాంతినగర్ ఆదర్శ పద్మశాలి సంఘం భవనంలో కామ్రేడ్ సోమిశెట్టి దశరథం అధ్యక్షతన వర్ధంతి సభ జరిగింది.
ఈ సందర్భంగా కామ్రేడ్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంలో జరిగిన విప్లవోద్యమంలో అమరులైన విప్లవకారులను స్మరించుకున్నారు. రాజ్యం కొనసాగించిన బూటకపు ఎన్‌కౌంటర్లలో అమరులైన కామ్రేడ్స్‌తో పాటు వయోభారం, అనారోగ్యంతో మరణించిన విప్లవకారులందరికీ విప్లవ జోహార్లు అర్పించారు. వారు నడిచిన బాటలో పయనిస్తూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విప్లవ మార్గంలో పయనించడమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు.
బూర్జువా దళారీ పాలకులు ప్రజలపై భారాలు మోపుతూ, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజలను విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల హక్కులు, ఆస్తులను కొల్లగొడుతూ దళారీ పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలకు పాలకులు అండగా నిలుస్తున్నారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
బూర్జువా రాజకీయ దళారీ వ్యవస్థను కూలదోసి ప్రజా వ్యవస్థను కాపాడాలంటే పోరాటమే మార్గమని, ప్రజలంతా ఆ దిశగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ వర్ధంతి సభ ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కామ్రేడ్ సోమిశెట్టి దశరథం, కామ్రేడ్ వొల్లాల కిషోర్, కామ్రేడ్ భామండ్ల రవీందర్, ఎర్రజెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూయ, కామ్రేడ్ బి. సంగీతక్క, జక్కని త్రివేణి, ముత్తంగి వసంత, మాసం ఆంజనేయులు, కొండ శ్యామ్, ఎర్రజెండా పవర్‌లూమ్ కార్మిక సంఘం నాయకులు గుజ్జే దేవదాస్, ఆకైనా సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.




