Sircilla: సిరిసిల్లలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల తనిఖీ!

Sircilla: రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ పెద్దూర్ మహాత్మా జ్యోతిబాపూలే విద్యాలయాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

KALEEM, SIRICILLA
Published on: 3 Oct 2026 6:57 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల తనిఖీ!

Sircilla: ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ప్రతి విద్యార్థి మంచిగా చదవడంతో పాటు ఆటలు ఆడుతూ, సంగీతం, డ్యాన్స్ వంటి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలని సూచించారు.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతి బాపూలే విద్యాలయాన్ని శనివారం సాయంత్రం కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి బియ్యం, కూరగాయలు, పండ్లు, నెయ్యి నాణ్యతతో పాటు వాటి గడువు తేదీలను తనిఖీ చేశారు. మెనూ చార్ట్‌ను పరిశీలించి, దాని ప్రకారం విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

నెలలో నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్, ప్రతిరోజూ గుడ్డు అందిస్తున్నారా అని ఆరా తీశారు. అనంతరం ఆర్వో ప్లాంట్‌ను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రవేశానికి ఎంతో మంది పోటీ పడుతారని, ఇక్కడ చదివే అవకాశం రావడం మంచి అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు రెసిడెన్షియల్ విద్యాలయాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యాలయాల పనితీరు, భోజన నాణ్యతను పరిశీలించేందుకు మండల స్థాయి అధికారులను తనిఖీ అధికారులుగా కేటాయించినట్లు పేర్కొన్నారు. వారు విద్యాలయాలను తనిఖీ చేయడంతో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని తెలిపారు.

విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తరగతి గదులు, వసతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. విలువైన సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి సారించాలని అన్నారు. ప్రతిరోజూ ఆటలు ఆడాలని, సంగీతం, నృత్యం వంటి తమకు ఆసక్తి ఉన్న రంగాల్లోనూ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు.

మంచిగా చదివి తమ ప్రాంతానికి, తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో విద్యార్థులు వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA