Sircilla: నిబంధనల ప్రకారమే ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలి

Sircilla: రాజన్న సిరిసిల్లలో నిబంధనల మేరకు ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 19 Nov 2026 10:10 PM IST
Sircilla
X

Sircilla: నిబంధనల ప్రకారమే ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలి

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ పంట దిగుబడుల కొనుగోళ్లను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలని సూచించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం సేకరణకు చేపట్టిన ఏర్పాట్లను అధికారులు వివరించారు. ఇప్పటివరకు ఐకేపీ ఆధ్వర్యంలో 115, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 108, మెప్మా ఆధ్వర్యంలో 6 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ధాన్యం సేకరణ కోసం 26 రైస్ మిల్లులతో పాటు ప్రభుత్వ ప్రత్యామ్నాయ గోదాములను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను సిద్ధంగా ఉంచాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, పౌర సరఫరాల శాఖ అధికారి తనూజా, మేనేజర్ గోపాల్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, సహకార శాఖ అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA