Sircilla: సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వే వేగవంతం చేయాలి కలెక్టర్ ఆదేశం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వే, భూ భారతి దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష. ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం.
Sircilla: సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వే వేగవంతం చేయాలి కలెక్టర్ ఆదేశం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
భూముల రీసర్వే ప్రక్రియ పురోగతి, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. రుద్రంగి మండలం రుద్రంగి, వీర్నపల్లి మండలం గర్జనపల్లి, గంభీరావుపేట మండలం ఖుర్దు లింగంపల్లి, కోనరావుపేట మండలం మర్తనపేట, సిరిసిల్ల మండలం పెద్దూరు, చందుర్తి మండలం ఎన్గల్, వేములవాడ అర్బన్ మండలం తెట్టెకుంట, తంగళ్లపల్లి మండలం తంగళ్లపల్లి, వేణుగోపాలపూర్, వేములవాడ రూరల్ మండలం రుద్రవరం, ముస్తాబాద్ మండలం గూడూరు, మొర్రాపూర్, బోయినపల్లి మండలం వర్దవెల్లి, కొదురుపాక, ఇల్లంతకుంట మండలం జవారిపేట, ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామాల్లో రీసర్వే కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు.
గ్రామాల సరిహద్దుల సర్వేను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, అటవీ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సంయుక్తంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. భూములకు సంబంధించిన సమాచారాన్ని పక్కాగా సేకరించి, ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని స్పష్టం చేశారు.
రీసర్వే చేపడుతున్న గ్రామాల్లో సంబంధిత జిల్లా అధికారులు, డీఐలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రక్రియను పరిశీలించాలని సూచించారు. భూముల వివరాల సేకరణలో పకడ్బందీగా వ్యవహరించాలని, అవసరమైన చోట పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా భూ భారతి కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పెండింగ్లో ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్ బాబు, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్లు, డీఐలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.




