Sircilla: ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఖరీఫ్ కొనుగోళ్లపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష. 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 24 Sept 2026 6:18 PM IST
Sircilla
X

Sircilla: ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

సిరిసిల్ల: ఖరీఫ్ సీజన్‌లో వివిధ పంటల కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ 2026-27 కొనుగోళ్లకు చేయాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో సుమారు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల సన్న, దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. అక్టోబర్ చివరి వారం నుంచి వరి ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ధాన్యం రవాణాకు సంబంధించి లారీ కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ ప్రకారం వాహనాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని వాహనాలకు జీపీఎస్ యంత్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోళ్లకు అనుగుణంగా గన్నీ సంచులను ముందస్తుగా అందుబాటులో ఉంచాలని తెలిపారు.

జిల్లాలో ప్రస్తుతం 4,335 టార్పాలిన్లు, 2 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, 270 గ్రైన్ కాలిపర్స్, 333 తేమ యంత్రాలు, 630 ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలు, 270 హస్క్ రిమూవర్లు, 2 డ్రైయర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా పత్తి సాగవుతుందని, సుమారు 4 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కూడా ఆయా శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

సమావేశంలో డీసీఎస్ఓ బుచ్చిబాబు, డీఎం గోపాల్, జిల్లా వ్యవసాయ అధికారిణి అఫ్జల్ బేగం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA