Sircilla: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి కలెక్టర్

Sircilla: సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం. లబ్ధిదారులకు ఆర్థిక సాయంపై అవగాహన కల్పించాలని సూచన.

KALEEM, SIRICILLA
Published on: 29 Oct 2026 5:00 PM IST
Sircilla
X

Sircilla: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి కలెక్టర్

సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలతో గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలాల వారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 6,465 ఇళ్లకు ముగ్గు పోయగా, 5,479 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయికి, 4,858 ఇళ్లు గోడల స్థాయికి, 4,585 ఇళ్లు స్లాబ్ స్థాయికి చేరుకున్నాయని, 3,934 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు.

ముగ్గు పోసిన లబ్ధిదారులతో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బేస్‌మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్లను గోడల స్థాయికి, అక్కడి నుంచి స్లాబ్ స్థాయికి తీసుకెళ్లి, తుది దశ పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

జిల్లాలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ఆయా లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలని సూచించారు. రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై కూడా ఆరా తీశారు.

ప్రతి ఎంపీడీఓ ఇంటి నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల ఫొటోలను హౌసింగ్ ఏఈలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని జమ చేస్తోందని తెలిపారు.

ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి, నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశిత ప్రణాళిక ప్రకారం నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిలో ఉత్తమ పనితీరు కనబరిచిన బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఖాజా ముజాఫరుద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA