Sircilla: లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్ఆర్‌సీ సమావేశం. వ్యవసాయం, విద్య, మహిళా సంఘాలకు 100% బ్యాంకు రుణాలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 22 Oct 2026 6:45 PM IST
Sircilla
X

Sircilla: లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లాలోని అన్ని బ్యాంకులు ప్రభుత్వ లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణం, మహిళా సంఘాలు, ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాలకు అర్హులైన వారికి రుణాలు అందించాలని సూచించారు.

గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, గృహ, విద్యా రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాలు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, పీఎం విశ్వకర్మ పథకాల అమలు, పురోగతి, లక్ష్య సాధనపై బ్యాంకుల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకులకు కేటాయించిన అన్ని విభాగాల్లో రుణాల లక్ష్యాలను చేరుకోవాలని, వ్యవసాయ, విద్య, స్వయం ఉపాధి, గృహ రుణాల పంపిణీలో 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు.

ఆర్‌ సేథీ ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షణ కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. వివిధ శాఖలు, పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్య శిక్షణ అందించాలని సూచించారు. ఇప్పటివరకు 13 విభాగాల్లో 314 మందికి శిక్షణ ఇచ్చిన సంస్థ ప్రతినిధులను అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స్వయం ఉపాధి కల్పించేలా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు.

మహిళా సంఘాలకు రుణాల పంపిణీపై సమీక్షించిన కలెక్టర్.. మహిళలు రుణాలను స్వయం ఉపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో మహిళా సంఘాలకు ప్రభుత్వ రుణ పథకాలపై అవగాహన కల్పించి, అర్హులైన వారికి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలోనూ అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు.

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాలపై బ్యాంకు వినియోగదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రజలకు అందించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎల్‌డీఎం రాజీవ్ కుమార్, ఆర్‌బీఐ ఎల్‌డీఓ చేతన్ ఎం. గోరేఖర్, నాబార్డ్ డీడీఎం దిలీప్ చంద్ర, యూబీఐ బ్యాంకు అధికారి కృష్ణమాచారి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA