Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు
Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ వేడుకలు. మహిళా అధికారులతో ఆడిపాడిన కలెక్టర్ గరిమ అగ్రవాల్, విజేతలకు బహుమతుల అందజేత.
Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ సంబురాలు వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు, సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహిళా అధికారులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని పేర్కొంటూ జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా బతుకమ్మలను తీర్చిదిద్ది వేడుకల్లో పాల్గొనడాన్ని అభినందించారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మల్లో జిల్లా వ్యవసాయ శాఖకు మొదటి బహుమతి, రెవెన్యూ శాఖకు రెండో బహుమతి, ఎంపీపీఎస్ తంగళ్లపల్లికి మూడో బహుమతి లభించాయి. విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేసి అభినందించారు.
వేములవాడలో శుక్రవారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించామని, ఆదివారం సిరిసిల్లలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, వేములవాడ ఆర్డీవో కే.ఎస్.బి. కుమారి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వివిధ శాఖల జిల్లా అధికారులు అఫ్జల్ బేగం, సౌజన్య, ఏంజెలా ఆల్ఫ్రెడ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.




