Sircilla: ఐదు రకాల పంటల సాగు: రైతుకు కలెక్టర్ అభినందన!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో ఎకరం 20 గుంటల్లో ఐదు రకాల పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతు తూము గంగాధర్‌ను కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు.
Sircilla: ఐదు రకాల పంటల సాగు: రైతుకు కలెక్టర్ అభినందన!
సిరిసిల్ల: రుద్రంగి మండలం మానాలలో పరిమిత నీటితో ఐదు రకాల పంటలు సాగు చేస్తున్న రైతు తూము గంగాధర్‌ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు. విభిన్న పంటల సాగుతో మంచి ఆదాయం పొందేలా వ్యవసాయం చేస్తున్న రైతు క్షేత్రాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.
రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన రైతు తూము గంగాధర్ తన ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమిలో అందుబాటులో ఉన్న నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఐదు రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 20 గుంటల్లో పసుపు, 10 గుంటల్లో వెల్లుల్లి, 10 గుంటల్లో ఉల్లిగడ్డ, 10 గుంటల్లో మిర్చి, మరో 10 గుంటల్లో కొత్తిమీర సాగు చేస్తున్నారు. పరిమిత నీటి వనరులతో విభిన్న పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పంటల సాగు, దిగుబడి, మార్కెట్‌పై కలెక్టర్ ఆరా
రైతు తూము గంగాధర్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పసుపు, వెల్లుల్లి తదితర పంటల సాగు వివరాలను తెలుసుకున్నారు. పంటలు ఎన్ని రోజులకు కోతకు వస్తాయి? ఎంత దిగుబడి వస్తుంది? ఎక్కడ విక్రయిస్తారు? ఎంత ఆదాయం పొందే అవకాశం ఉందని రైతును అడిగి తెలుసుకున్నారు. పసుపును స్థానిక మార్కెట్‌తో పాటు కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ మార్కెట్లకు తరలించి విక్రయిస్తామని రైతు గంగాధర్ కలెక్టర్‌కు వివరించారు. మిగతా పంటలకు స్థానికంగా మార్కెట్ సౌకర్యం ఉందని తెలిపారు.
అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ విభిన్న పంటలు సాగు చేస్తున్న రైతు తూము గంగాధర్‌ను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ పరిశీలనలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి సంపత్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.




