Sircilla: ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను వేగవంతం చేయాలి
Sircilla: చందుర్తి మండలం మూడపెల్లిలో రూ.200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు.
Sircilla: ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను వేగవంతం చేయాలి
సిరిసిల్ల: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్ణీత ప్రణాళిక ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
చందుర్తి మండలం మూడపెల్లిలో తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం పనులను జిల్లా కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణంలో కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, విద్యాలయాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
కలెక్టర్ పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ కేఎస్బీ కుమారి, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామకృష్ణ, తహసీల్దార్ భూపతి, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




