Sircilla: భూసేకరణ పనులను వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ ఆదేశం
Sircilla: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
Sircilla: భూసేకరణ పనులను వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ ఆదేశం
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం, పునరావాస పునరావాస పునరుద్ధరణ (ఆర్‌అండ్‌ఆర్) పనుల పురోగతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనులకు అవసరమైన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భూసేకరణకు రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు భూసేకరణ పరిహారాన్ని నిర్వాసితులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.
భూసేకరణ పనులకు ప్రత్యేక అధికారులను నియమించి బాధ్యతలు అప్పగించాలని, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని పనులను పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు రెవెన్యూ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పురోగతిని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ఇప్పటికే విడుదలైన రూ.2,550 కోట్లను పూర్తిగా వినియోగించిన అనంతరం అవసరాన్ని బట్టి అదనపు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భూసేకరణ ప్రక్రియలో రైతుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యలు ఎదురైతే హైదరాబాద్‌లోని భూసేకరణ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇప్పటికే అవార్డులు జారీ చేసిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపులను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులకు సంబంధించి సుమారు రూ.3,100 కోట్ల విలువైన పనులను గుర్తించగా, రూ.2,514 కోట్ల మేర నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. పరిహారం నేరుగా రైతులకు చేరేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో రానున్న సీజన్‌లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి దయాకర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




