Sircilla: భూభారతి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
Sircilla: సిరిసిల్లలో భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియపై సమీక్ష సమావేశం.
Sircilla: భూభారతి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
సిరిసిల్ల: భూభారతి దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు, సర్వే వివరాలను పట్టాదారులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు.
భూభారతి దరఖాస్తులు, భూముల రీ సర్వే తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఇప్పటివరకు సర్వే చేపట్టిన గ్రామాలు, సర్వే పురోగతి, తదుపరి కార్యాచరణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సమన్వయంతో పనిచేసి భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని, భూముల రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే నిర్వహించే గ్రామాల్లో పట్టాదారులకు ముందస్తు సమాచారం అందించాలని, వారి సమక్షంలోనే భూముల సర్వే చేపట్టాలని స్పష్టం చేశారు.
డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్, జీపీఓలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో సర్వే పనులను తప్పనిసరిగా పర్యవేక్షించాలని, లైసెన్స్‌డ్ సర్వేయర్ల సహకారంతో ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, ఆయా మండలాల తహసీల్దార్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.




