Sircilla: రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు గడువు విధించి వేగం పెంచాలి
Sircilla: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన.
Sircilla: రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు గడువు విధించి వేగం పెంచాలి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు ప్రతి పనికి గడువు విధించాలని సూచించారు.
వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, అన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం, 80 ఫీట్ల రహదారి నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో దేవాదాయ, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, ఎన్పీడీసీఎల్, రెవెన్యూ, పర్యాటక శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను ప్రణాళిక ప్రకారం వేగవంతం చేయాలని, అవసరమైన మేరకు కార్మికుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.
రాజన్న ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న 80 ఫీట్ల రహదారి విస్తరణ పనులను గడువులోగా పూర్తి చేయాలని, విద్యుత్ టవర్లకు సంబంధించిన పనులను కూడా చేపట్టాలని సూచించారు. గుడిచెరువు బండ్ పార్కులో మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి వేములవాడ మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఆలయ ఈఈ రాజేష్, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్, వీటీఏడీఏ, పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




