Sircilla: ఎస్ఐఆర్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
Sircilla: ఎస్ఐఆర్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Sircilla: ఎస్ఐఆర్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
సిరిసిల్ల: ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ)లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిశీలించి, పెండింగ్లో ఉన్న విచారణలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలను సకాలంలో చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ నోటీసుల జారీపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.
బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడంతో పాటు, అవసరమైన పత్రాలను అక్కడే స్వీకరించాలని సూచించారు. ఓటర్ల అర్హతలను నిర్ధారించే సమయంలో సంబంధిత పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి, అర్హుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో తప్పులు, అనర్హుల నమోదు, డూప్లికేట్ వివరాలు లేకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, దరఖాస్తులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన భౌతిక రికార్డులను సక్రమంగా నిర్వహించి భద్రపరచాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో వేములవాడ ఆర్డీవో కే.ఎస్.బి. కుమారి, తహసీల్దార్ జయంత్, ఎన్నికల విభాగం అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.




