Sircilla: సిరిసిల్లలో ఘనంగా బాపూజీ 111వ జయంతి: బీఆర్‌ఎస్ నివాళి
Sircilla: సిరిసిల్లలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు.
Sircilla: సిరిసిల్లలో ఘనంగా బాపూజీ 111వ జయంతి: బీఆర్‌ఎస్ నివాళి
Sircilla: సిరిసిల్ల పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి, బీఆర్‌ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్‌లు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం కోసం, తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం, త్యాగం, ప్రజాసేవ చిరస్మరణీయమని అన్నారు. పద్మశాలి సామాజిక వర్గం ఐక్యత కోసం అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ.. తెలంగాణ సాయుధ పోరాటం, తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు విలువైన సూచనలు, సలహాలు అందిస్తూ మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు.
సిరిసిల్ల పద్మశాలీల కోరిక మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కృషితో కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని జిందం చక్రపాణి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన త్యాగాలు, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో అధికారికంగా ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఈ సందర్భంగా చేనేత కార్మికులను సన్మానించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ఉపాధ్యక్షులు డాక్టర్ గాజుల బాలయ్య, మోర రవి, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, పద్మశాలి యువజన విభాగం అధ్యక్షుడు సబ్బని హరీష్‌తో పాటు పద్మశాలి సంఘం నాయకులు, కుల బాంధవులు తదితరులు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులర్పించారు.




