Sircilla: అంగన్వాడీలకు పిల్లలను రోజూ పంపాలి: కలెక్టర్ గరిమ!

Sircilla: బోయినపల్లి మండలం రామన్నపేట అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. పిల్లలకు పోషకాహారం అందించాలని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Oct 2026 4:39 PM IST
Sircilla
X

Sircilla: అంగన్వాడీలకు పిల్లలను రోజూ పంపాలి: కలెక్టర్ గరిమ!

Sircilla: ఆరేళ్లలోపు పిల్లలను తల్లిదండ్రులు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, వారి ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. పిల్లలకు చిన్ననాటి నుంచే సరైన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని పేర్కొన్నారు.

బోయినపల్లి మండలం రామన్నపేటలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రతి మంగళవారం 10 నిమిషాలు’ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఎత్తు, బరువు నమోదు చేసే ప్రక్రియను పరిశీలించారు.

సామ్, మామ్ పిల్లల పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రంలో తాగునీటి యంత్రం పనితీరు, ఫ్యాన్లు, లైట్లను తనిఖీ చేశారు. అంగన్వాడీ ఆవరణలో సాగు చేస్తున్న వివిధ రకాల కూరగాయల తోటను సందర్శించారు. పోషణ మాసం ప్రాముఖ్యతను గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులకు వివరించి చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మంగళవారం 10 నిమిషాల కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో సేవలు, వసతుల మెరుగుదల, పోషకాహార పంపిణీ, బాలల హక్కుల పరిరక్షణ, మౌలిక వసతుల పెంపుపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు తీసుకెళ్లి వారి ఎత్తు, బరువును నమోదు చేయించాలని, ఎదుగుదలకు అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారంతో పాటు ఆటలు, పాటలు, బొమ్మల ద్వారా విద్యాబోధన అందిస్తారని తెలిపారు. బాలల జీవితంలో మొదటి వెయ్యి రోజులు అత్యంత కీలకమని, ఈ దశలో ఇంట్లోనూ తగిన పోషకాహారం అందించాలని స్పష్టం చేశారు.

తల్లులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి

దేశంలో దాదాపు 50 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. రక్తహీనత ఉన్న మహిళలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, మునగకాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రత్యేక వైద్య సేవలపై అవగాహన

ఎదుగుదల లోపాలు, వినికిడి, మాట, మానసిక వికాస సమస్యలు, నడవలేకపోవడం, పుట్టుకతో వచ్చే లోపాలు, మెదడుకు సంబంధించిన సమస్యలు, రక్తహీనత, పోషకాహార లోపాలతో బాధపడుతున్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.

ఆర్‌బీఎస్‌కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి పిల్లలను తరలించి వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు. కరీంనగర్‌లోని ఎన్‌ఆర్‌సీ కేంద్రంలోనూ సేవలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన ఉన్నత వైద్య సేవలను హైదరాబాద్‌లో అందిస్తారని వివరించారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పరిశీలన

రామన్నపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. లబ్ధిదారు అక్కేనపల్లి కావ్య ఇంటి నిర్మాణ పురోగతిపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శరత్ బాబు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, సర్పంచ్ కవిత తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA