Peddapalli: సింగరేణి కార్మికులకు 34% లాభాల వాటా ప్రకటన!
Peddapalli: సింగరేణి కార్మికులకు 34% లాభాల వాటా ప్రకటన. ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షలు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ – ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటన.
Peddapalli: సింగరేణి కార్మికులకు 34% లాభాల వాటా ప్రకటన!
Peddapalli: సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటన. తెలంగాణ ప్రజా భవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సింగరేణి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలు, సింగరేణి యాజమాన్యంతో కలిసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పాల్గొన్నారు.
సింగరేణి సంస్థ సాధించిన రూ.1,754 కోట్ల లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటా ప్రకటించారు. దీనివల్ల ఒక్కో ఉద్యోగికి సగటున రూ.1,53,912 అందనుంది. అలాగే దసరా బోనస్ గా రూ.1,10,250 చొప్పున ప్రకటించారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ప్రకటించారు. రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కూడా కీలకమని ప్రభుత్వం గుర్తించింది.
కార్మికుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కార్మికుల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన సొంత ఇంటి కలను నెరవేరుస్తామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న వారసత్వ ఉద్యోగాల సమస్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. విజిలెన్స్ విచారణలు, పెండింగ్ కేసుల కారణంగా ఆగిపోయిన ఉద్యోగాల సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కార్మికుల పిల్లలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.




