Singareni: రాజకీయ జోక్యంతోనే సింగరేణి ఒప్పందాలు ఆగుతున్నాయి ఏఐటియుసి
Singareni: సింగరేణిలో రాజకీయ జోక్యంతోనే ఆర్.ఎల్.సి ఒప్పందాలు అమలుకావడం లేదని ఏఐటియుసి మడ్డి ఎల్లా గౌడ్ ఆరోపణ. ఆర్జీ-1 జీఎం కార్యాలయం ముట్టడి, సీఎండీకి హెచ్చరిక.
Singareni: రాజకీయ జోక్యంతోనే సింగరేణి ఒప్పందాలు ఆగుతున్నాయి ఏఐటియుసి
సింగరేణి: సింగరేణి లో ఏఐటియుసి తో యాజమాన్యం చేసుకున్న ఒప్పందం డిమాండ్ లు రాజకీయ జోక్యం వల్లే అమలు కావడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ ఆరోపించారు. బుధవారం సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆద్వర్యంలో జరిగిన ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్మికుల పెండింగ్ సమస్యల పై ఆగస్టు 27న రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్.ఎల్.సి) వద్ద 23 డిమాండ్లపై కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు యాజమాన్యం సర్క్యులర్ లు జారీ చేయాల్సి ఉండగా, జారీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కార్మికుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తెచ్చినా, ధర్నాలు, ఆందోళనలు చేసినా పరిష్కారం కాకపోవడంతో 2026 జూన్ 8న సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. దీనిపై లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల్లో ఆగస్టు 27న యాజమాన్యంతో 23 డిమాండ్లపై ఒప్పందం కుదిరిందని, నేటికీ అనేక అంశాలు అమలుకు నోచుకోకపోవడం తో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా యాజమాన్యం అంగీకరించిన సింగరేణి కార్మికుల ప్రధాన డిమాండ్ లు ఐన ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహిస్తామని హామీ ఇచ్చి మూడు నెలలు నిర్వహించి ఆపివేయడం అన్యాయమని, అదేవిధంగా మారుపేర్ల సమస్య పై 2022 ఏప్రిల్ లో కుదిరిన ఒప్పందం, ప్రభుత్వ కమిటీ నివేదిక తర్వాత కూడా సమస్య పరిష్కారం కాలేదని, ముఖ్యంగా 35-40 సంవత్సరాల వయస్సు గల అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వి.టి.సి పూర్తి చేసి మిగిలిన అర్హులైన డిపెండెంట్ అభ్యర్థులందరికీ నెల రోజుల్లోపు నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అర్హులైన సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి పథకాన్ని వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయడం లేదని ఆయన అన్నారు. గనుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన బూట్లు, హెల్మెట్లు, బిట్లు, డ్రిల్ రాడ్లు, యంత్రాలు, హెచ్.ఈ.ఎం.ఎం యంత్రాల స్పేర్ పార్టులు, టైర్లు తక్షణమే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని, ఇంత వరకు సరఫరా చేయలేదని ఆయన ఆరోపించారు.
విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ.59,000 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ల మధ్య పోటీతత్వం కార్మికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో గుర్తింపు సంఘం ఏఐటియుసితో ఆర్.ఎల్.సి సమక్షంలో చేసుకున్న ఒప్పందాలను అమలు కాకుండా ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
టీబీజీకేఎస్ సంఘం గత 10 ఏళ్లు గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసి, ఇప్పుడు ఎన్నికలు జరగాలని కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదమన్నారు. ఏఐటియుసి ఎన్నికలకు సిద్ధంగా ఉందని, ఎన్నికలంటే భయపడే సంఘం కాదని స్పష్టం చేశారు.
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యం తగ్గించాలని, ఐఎన్టీయూసీ నాయకులు 59 వేల కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా పోరాటాలు చేయాలని కోరారు. గుర్తింపు సంఘం ఏఐటియుసి పై విమర్శలు చేయడం కాదని ఆయన అన్నారు. ముట్టడి అనంతరం అధికారుల కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, సింగరేణి సీఎండీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, పెండింగ్ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను, సహాయ కార్యదర్శి మాదన మహేష్, ఉపాధ్యక్షులు సంకె అశోక్, బోగ సతీష్ బాబు, నాయకులు ఎస్. వెంకట్ రెడ్డి, సిద్దమల్ల రాజు, దొంత సాయన్న, ఎం.చక్రపాణి, చెప్యాల భాస్కర్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయిని శంకర్, బలుసు రవి, బండి మల్లేష్, ఇజ్జగిరి రాజు, బొల్లి శ్రీనివాస్, ఏ.వి.ఎస్. ప్రకాశ్, తాళ్ళపెల్లి శ్రీనివాస్, మారుపేర్లు బాదితుల సంఘం నాయకులు లంక శ్రావణ్ గౌడ్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




