Sircilla: మహిళల భద్రతపై విద్యార్థినులకు అవగాహన అవసరం..సిరిసిల్ల షీ టీమ్స్!
Sircilla: సిరిసిల్లలోని సహస్ర జూనియర్ కళాశాలలో షీ టీమ్స్, AHTU ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Sircilla: మహిళల భద్రతపై విద్యార్థినులకు అవగాహన అవసరం..సిరిసిల్ల షీ టీమ్స్!
Sircilla: మహిళల భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ వంటి అంశాలపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా బుధవారం సిరిసిల్ల పట్టణంలోని సహస్ర జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాల్య వివాహాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టం తదితర అంశాలపై వివరించారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వీటి వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు లేదా మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, బాలికల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినా, వేధింపులకు గురిచేసినా, ర్యాగింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధింపులకు గురైన విద్యార్థినులు భయపడకుండా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి అవసరమైన రక్షణ, సహాయం అందిస్తామని భరోసా కల్పించారు.
అలాగే డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ ప్రమీల, షీ టీమ్, AHTU సిబ్బంది పాల్గొన్నారు.




