Karimnagar: సిఈసి జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేసిన SFI, DYFI!

Karimnagar: కరీంనగర్ తెలంగాణ చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 Oct 2026 1:33 PM IST
Karimnagar
X

Karimnagar: సిఈసి జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేసిన SFI, DYFI!

Karimnagar: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని, SIR ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, DYFI జిల్లా కార్యదర్శి, నరేష్ పటేల్ మాట్లాడుతూ, ఓట్ల తొలగింపునకు బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా యువత జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిస్తే, కేంద్ర ప్రభుత్వం రైళ్లు, బస్సులను వివిధ ప్రాంతాల్లో నిలిపివేసి యువతను అడ్డుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. దేశ యువత పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ప్రజలు తమ నిరసనను తెలియజేసుకునే హక్కును కూడా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు.జ్ఞానేష్ కుమార్ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా, బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. SIR ప్రక్రియ కారణంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయని, ఈ పరిణామాలు ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న 37 లక్షల ఓట్లు తొలగించారనే ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని, సుమారు 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుని బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.

రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కడం సరికాదని అన్నారు. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది అని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా ఎన్నికల కమిషన్ పనిచేయాలని సూచించారు.SIR ప్రక్రియను రద్దు చేయాలని, ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం వారి రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును హరించడమేనని అన్నారు.

తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను కోరారు.బీజేపీకి ఎన్నికల కమిషన్ అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించిన నాయకులు, SIR పేరుతో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు చర్యలు తీసుకోవాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేపడతామని SFI, DYFI జిల్లా కమిటీ నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, సహాయ కార్యదర్శి భోగేశ్వర్, గట్టు ఆకాష్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్ , జిల్లా నాయకులు అభిషేక్ కిట్టు, దేవరాజు, లక్మణ్, సిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR