Karimnagar: ఐఐటీ బాంబే డైరెక్టర్ రాజీనామా చేయాలి: SFI

Karimnagar: ఐఐటీ బాంబేలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, వరుస ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ డైరెక్టర్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 27 Oct 2026 5:39 PM IST
Karimnagar
X

Karimnagar: ఐఐటీ బాంబే డైరెక్టర్ రాజీనామా చేయాలి: SFI

కరీంనగర్: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబేలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి అని సమావేశం జిల్లా కార్యాలయం మంకమ్మ తోటలోని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ గత 13 నెలల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాల్సిన విద్యాసంస్థలో ఇలాంటి ఘటనలు జరగడం అక్కడి పరిపాలనా వైఫల్యాన్ని తెలియజేస్తోందని అన్నారు.సాహిల్ వాకోడే మరణం విషయంలో ఐఐటీ బాంబే యాజమాన్యం వ్యవహరించిన తీరు బాధాకరమని విమర్శించారు.

ఎలాంటి పూర్తిస్థాయి విచారణ జరగకముందే సాహిల్‌పై ఆరోపణలతో ప్రకటన విడుదల చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేస్తున్న విద్యార్థులతో చర్చలు జరపాల్సిన యాజమాన్యం, వారిని నిర్బంధించడం, నిరసన స్థలాన్ని తొలగించడం వంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని అన్నారు.

విద్యార్థులకు చెందిన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, మందులు, పుస్తకాలు, గదుల తాళాలు, ఇతర అవసరమైన వస్తువులను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా వారి నిరసనలను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని అన్నారు. విద్యార్థులకు మెరుగైన మానసిక ఆరోగ్య సేవలు అందించాలని, క్యాంపస్‌లో సమానత్వం, భద్రత కల్పించాలని, విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ కేదారే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, విద్యార్థులపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు.విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా విద్యాసంస్థల్లో విద్యార్థులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని SFI కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇసాక్, ఆకాష్, సురేష్ జిల్లా కమిటీ సభ్యులు రక్షక, నరేష్, సంతోష్, నాయకులు రిషి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN