Karimnagar: కరీంనగర్‌లో సర్దార్ పటేల్ 151వ జయంతి వేడుకలు

Karimnagar: కరీంనగర్‌లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ క్యాంపు కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి వేడుకలను బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 31 Oct 2026 3:48 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో సర్దార్ పటేల్ 151వ జయంతి వేడుకలు

కరీంనగర్: భారతరత్న, స్వతంత్ర భారతదేశ తొలి హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి వేడుకలు కరీంనగర్ నగరంలో ఘనంగా నిర్వహించారు. చైతన్యపురిలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి, తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం 560కి పైగా స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి అఖండ భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు.

హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు ఆయన చేపట్టిన 'ఆపరేషన్ పోలో' ద్వారా తెలంగాణ ప్రాంతానికి నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని పేర్కొన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన కృషి, ధైర్యసాహసాలు, దూరదృష్టి భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్‌లోని నర్మదా నది తీరాన 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహమైన 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ'ని నిర్మించడం ఆయనకు దేశం అందించిన ఘనమైన నివాళి అని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఆయన పేరుతో విద్యాసంస్థలు, వైద్య సంస్థలు, సేవా సంస్థలు ఏర్పాటు కావడం ఆయన ఆశయాలకు, దేశానికి చేసిన సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN