Sircilla: సిరిసిల్లలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.. అంబేద్కర్‌కు నివాళులు!

Sircilla: రాజన్న సిరిసిల్లలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. హక్కులతో పాటు ప్రాథమిక విధులు పాటించాలని సామాజిక సమరసత వేదిక నేత మోర శ్రీనివాస్ పిలుపు.

KALEEM, SIRICILLA
Published on: 26 Nov 2026 11:55 AM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.. అంబేద్కర్‌కు నివాళులు!

Sircilla: రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో పాటు ప్రతి పౌరుడు ప్రాథమిక విధులను కూడా గుర్తెరిగి నడుచుకోవాలని సామాజిక సమరసత వేదిక విభాగ్ సహసంయోజక్ మోర శ్రీనివాస్ అన్నారు. రాజ్యాంగం దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలకు పునాది అని పేర్కొన్నారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో సంవిధాన్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ విగ్రహానికి మోర శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును పురస్కరించుకొని ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రత్యేకమన్నారు. రాజ్యాంగ రూపకర్తలను గౌరవించుకోవడంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకునే సందర్భమిదని తెలిపారు. పౌరుల్లో రాజ్యాంగ విలువలను పెంపొందించేందుకు 2015 నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు.

ప్రపంచంలోని అనేక దేశాలు పాలనాపరమైన సమస్యలు, సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలతో ముందుకు సాగుతోందని అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సమరసతకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

ప్రతి పౌరుడు రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక సూత్రాలను పాటిస్తూ దేశ ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని సూచించారు. దేశమే మొదటి ప్రాధాన్యత (నేషన్ ఫస్ట్) అనే భావనతో ప్రతి ఒక్కరూ దేశం పట్ల దేశభక్తిని, రాజ్యాంగం పట్ల విశ్వసనీయతను కలిగి ఉండాలని మోర శ్రీనివాస్ అన్నారు.

ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక బాధ్యులు సుంకోజు రమేష్ చారి, కోడం రవి, ఎర్రోజు శ్రీనివాస్, చిమ్మని ప్రకాష్, గుడ్ల విష్ణు, మాదాసు శ్రీనివాస్, బండారి కార్తీక్, నేరేళ్ల రంజిత్ గౌడ్, శ్రీకాంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA