Vemulawada: వేములవాడ రూరల్‌లో రూ.3.94 కోట్లతో మార్కెట్ యార్డు పనులు!
Vemulawada: వేములవాడ రూరల్ మర్రిపల్లిలో రూ.3.94 కోట్లతో నూతన మార్కెట్ యార్డు, పట్టణంలో రూ.75 లక్షల షెడ్ల పనులకు శుక్రవారం విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
Vemulawada: వేములవాడ రూరల్‌లో రూ.3.94 కోట్లతో మార్కెట్ యార్డు పనులు!
Vemulawada: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేముల రూరల్ మండల పరిధిలో మర్రిపల్లి గ్రామంలో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధి పనులకు రూ.3.94 కోట్ల నిధులు మంజూరు కాగా, ఈ పనులకు విప్ శంకుస్థాపన చేశారు.
వేములవాడ పట్టణంలో మార్కెట్ యార్డ్ లో 75 లక్షలతో నిర్మిస్తున్న కవర్ షేడ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్ తో కలిసి శంకుస్థాపన చేశారు.. అనంతరం ఆత్మ కమిటీ నూతన కార్యాలయన్నీ విప్ ప్రారంభించారు...
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధికి సుమారు రూ.7 కోట్లకు పైగా అంచనాలతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మొదటి దశలో రూ.3.94 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టామని, మరో రూ.3 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి రెండో దశలో షెడ్ల నిర్మాణం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ భవన నిర్మాణం తదితర పనులు చేపడతామని వెల్లడించారు. రైతుల అవసరాల దృష్ట్యా మార్కెట్ యార్డులో అదనంగా రూ.70 లక్షలతో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు..
గతంలో వ్యవసాయ మార్కెట్‌కు కేటాయించిన స్థలం అనువుగా లేకపోవడంతో స్వయంగా పరిశీలించి, రైతులకు ఉపయోగపడే విధంగా నూతన స్థలంలో మార్కెట్ యార్డు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం చేసిన కృషి, ప్రతిపాదనల మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించామని చెప్పారు.
ప్రజా జీవితంలో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ మనం ప్రజల కోసం చేసిన పనులే చిరకాలం గుర్తుండిపోతాయని ఆది శ్రీనివాస్ అన్నారు. సర్పంచి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఏ హోదాలో ఉన్నా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు సమష్టిగా కృషి చేసి రైతుల కోసం మంచి మార్కెట్ యార్డు నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
వేముల రూరల్‌కు నూతన ఎమ్మార్వో కార్యాలయం
వేములవాడ రూరల్ మండలానికి నూతన ఎమ్మార్వో కార్యాలయం మంజూరైందని, ఇందుకోసం రూ.2 కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. శాత్రాజ్పల్లి, చెక్కెపల్లి, మర్రిపల్లి, హనుమాజీపేట తదితర నాలుగు మార్గాల నుంచి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేస్తున్నామని చెప్పారు. నూతన మార్కెట్ యార్డు స్థలంలో ఎకరం భూమిని ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణానికి కేటాయించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరగా, మార్కెట్ కమిటీ పాలకవర్గం కూడా అంగీకరించిందని తెలిపారు. కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపడతామని వెల్లడించారు.
*నియోజకవర్గంలో నాలుగు నూతన సింగిల్ విండోలు*
రైతులకు సహకార సేవలను మరింత చేరువ చేసేందుకు నియోజకవర్గంలో చెక్కెపల్లి, రుద్రంగి, కతలాపూర్, మన్నెగూడెం ప్రాంతాల్లో నూతన సింగిల్ విండో కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. మొత్తం ఆరు ప్రాంతాలకు ప్రతిపాదనలు పంపగా, నాలుగు ప్రాంతాల్లో అనుకూలత ఉండటంతో మంజూరు లభించిందన్నారు. మిగిలిన రెండు ప్రాంతాల్లోనూ భవిష్యత్తులో రైతుల ఖాతాలు, బ్యాంకింగ్ సేవలు పెరిగినప్పుడు సింగిల్ విండోలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆది శ్రీనివాస్ అన్నారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.




