Sircilla: నేతన్నలకు అండగా రేవంత్ రెడ్డి సర్కారు: విప్ ఆది శ్రీనివాస్
Sircilla: సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
Sircilla: నేతన్నలకు అండగా రేవంత్ రెడ్డి సర్కారు: విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: నేతన్నల సంక్షేమం, చేనేత రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిరిసిల్ల చేనేత వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. నేతన్నలకు చేతినిండా పని కల్పించడంతో పాటు చేనేత రంగాన్ని తిరిగి బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి గతంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పలువురికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సుమారు రూ.49 కోట్ల మేర నేతన్నల రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. నేతన్నలకు నిరంతరం ఉపాధి లభించేలా, చేనేత రంగం తిరిగి పుంజుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేనేత రంగానికి సంబంధించిన విద్యుత్ బకాయిల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా, ఆచరణలో నేతన్నలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత కూడా కొంతకాలం విద్యుత్ సంస్థల పరిధిలో నేతన్నలు సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు.
నేతన్నల విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోకి వచ్చిన 48 గంటల్లోనే నేతన్నలు కోరిన 25 హెచ్పీ విద్యుత్ కనెక్షన్లలో మార్పు చేయడం జరిగిందని వివరించారు. నేతన్నల నుంచి వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు తక్కువ ధరలకు విద్యుత్ స్తంభాలు అందించే చర్యలు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల కలెక్టర్ చౌరస్తా వద్ద నేతన్నల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ‘జోట నాడే’ స్టాచ్యూ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. సిరిసిల్లకు చేనేత రంగం, నేతన్నల జీవితం ఎంతగా ముడిపడి ఉందో ఈ ఏర్పాటు ప్రతిబింబిస్తుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన సహకారం అందిస్తూ, వ్యాపారులు, కార్మికులు, నేతన్నల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సభను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ముఖ్యంగా చేనేత రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రజలకు వివరించాలని కోరారు.




