Sircilla: నేతన్నల సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్లలో సీఐటీయూ భారీ ధర్నా!
Sircilla: నేతన్నల సమస్యలు పరిష్కరించాలని, ఇందిరా మహిళా శక్తి చీరలకు 10% యారన్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ సిరిసిల్లలో సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది.
Sircilla: నేతన్నల సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్లలో సీఐటీయూ భారీ ధర్నా!
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇందిరా మహిళా శక్తి చీరలకు 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికులు, వార్పిన్, వైపని, అనుబంధ రంగాల కార్మికులు, ఆసాముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం బీవై నగర్‌లోని చేనేత, జౌళి శాఖ కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం చేనేత, జౌళి శాఖ ఏడీ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కోడం రమణ మాట్లాడుతూ.. గతంలో బతుకమ్మ చీరలకు అందించిన విధంగానే ఇందిరా మహిళా శక్తి చీరలకు కూడా 10 శాతం యారన్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. వర్కర్ టు ఓనర్ పథకానికి వెంటనే లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేయాలని, త్రిఫ్ట్ పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఆర్డీ-2 ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. నేతన్న బీమా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణలోనే అత్యధిక మరమగ్గాలు కలిగిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వేలాది మంది కార్మికులు, అనుబంధ రంగాల వారు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కేవలం షెడ్ల నిర్మాణానికే పరిమితం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా పథకం అమలుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోడం రమణ కోరారు. గతంలో బతుకమ్మ చీరలకు ఇచ్చిన యారన్ సబ్సిడీని ఇందిరా మహిళా శక్తి చీరలకు కూడా వర్తింపజేయడంతో పాటు నేతన్న బీమాను కొనసాగించేలా ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు.
రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందిస్తున్నామని ప్రకటిస్తున్న ప్రభుత్వం, ఆ చీరలను ఎంతో కష్టపడి నైపుణ్యంతో ఉత్పత్తి చేస్తున్న నేతన్నల సమస్యలను కూడా పరిష్కరించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నేతన్నల డిమాండ్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, నక్క దేవదాస్, గుండు రమేష్, మ్యాన రాజు, బాస శ్రీధర్, సబ్బని చంద్రకాంత్, బెజుగం సురేష్, స్వర్గం చంద్రశేఖర్, అవధూత హరిదాసు, కందుకూరి రమేష్, దేవరాజు, రాకేష్, భాస్కర్, అరుణ్, లక్ష్మీనారాయణ, ప్రభాకర్, శ్రీనివాస్, రమేష్, సదానందం, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.




