Karimnagar: మానవీయ కోణంలో ప్రజా సమస్యల పరిష్కారం కావాలి: కలెక్టర్
Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో 92 అర్జీలు అందాయని, సమస్యలను మానవీయ కోణంలో త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.
Karimnagar: మానవీయ కోణంలో ప్రజా సమస్యల పరిష్కారం కావాలి: కలెక్టర్
కరీంనగర్ : ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి, వాటికి సత్వర పరిష్కారం చూపడమే ప్రజావాణి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. అర్జీల స్వీకరణ, పరిష్కారం, పెండింగ్ వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించాలని తెలిపారు. ప్రజావాణిలో వస్తున్న ప్రతి అర్జీకి తప్పనిసరిగా రసీదు అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష..
ప్రజావాణి కార్యక్రమానంతరం పెండింగ్ దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అత్యధిక దరఖాస్తులు పెండింగ్లో ఉన్న జిల్లా పంచాయతీ, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖ ఆర్టీసీ ఇరిగేషన్ తదితర శాఖల అధికారులను దరఖాస్తుల స్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి దరఖాస్తులపై ఎట్టి పరిస్థితులను నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. ప్రతి దరఖాస్తు ను క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించి అర్జీదారుకు సమాచారం తెలియజేయాలని అన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం చేయలేని అర్జీలు వస్తే దరఖాస్తుదారులకు వివరంగా తెలియజేయాలని పేర్కొన్నారు.
సీఎం ప్రజావాణికి సంబంధించిన అన్ని దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ శాఖల వారీగా పెండింగ్ కోర్టు కేసులను పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
4,880 అర్జీలకు పరిష్కారం...
2026 మే నుంచి అక్టోబర్ వరకు జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 5,943 అర్జీలు స్వీకరించగా, వాటిలో 4,880 అర్జీలను పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ కారణాలతో 1,063 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వెలువడుతున్న ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి ముగిసిన వెంటనే డీపీఆర్వో కార్యాలయం నుంచి మీడియా ప్రతినిధులకు ఫొటోలు సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి నిర్వహణలో పారదర్శకత, అర్జీల పరిష్కారం, మీడియా సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లా అధికారులు ప్రతివారం టూర్ డైరీ సమర్పించాలి..
అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ప్రతివారం తమ టు డైరీ జిల్లా రెవెన్యూ అధికారికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాబోయే వారంలో నిర్వహించవలసిన పనులపై అడ్వాన్స్ టూర్ ప్రోగ్రాం డైరీ సిద్ధం చేసుకోవాలని, వారం తర్వాత అధికారుల టూర్ డైరీని సమర్పించాలని తెలిపారు.జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని, క్షేత్రస్థాయి సందర్శనలో అధికారులు ప్రజా అవసరాలను సమస్యలను గుర్తించి జిల్లా యంత్రాంగం నిర్వహించి చర్చించాలని తెలిపారు. అంతిమంగా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా అధికారుల క్షేత్ర సందర్శన ఉండాలని అన్నారు.
19న ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలి..
ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిర్మాణం పూర్తయిన వివో గ్రామపంచాయతీ అంగన్వాడి పాఠశాల తరగతి గదులు వంటి ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోనూ పనులు పూర్తయిన వివిధ భవనాల ప్రారంభోత్సవాలు ఉంటాయని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్న అన్ని భవనాల జాబితాను సంబంధిత మండల అధికారులకు అందజేయాలనిu ఆదేశించారు. మండల స్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు తమ మండలాలు గ్రామాల్లో ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో సందర్శించి పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజావాణికి 92 దరఖాస్తులు..
సోమవారం ఐ డి ఓ సి లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 92 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు 19, గృహ నిర్మాణ సంస్థకు 16, కరీంనగర్ ఆర్డిఓ కార్యాలయానికి 12 దరఖాస్తులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి డిఆర్ఓ స్వామి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




