Manthani: జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: అంకరి కుమార్
Manthani: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా మంథనిలో గాంధీ విగ్రహానికి, మున్సిపల్ చైర్మన్‌కు ప్రెస్ క్లబ్ నేతలు వినతిపత్రం ఇచ్చారు.
Manthani: జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: అంకరి కుమార్
మంథాని: జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలను వెంటనే అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం మంథనిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా అంకరి కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, జర్నలిస్టు కుటుంబాలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, మంథని ప్రెస్ క్లబ్ శాశ్వత భవనానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు బస్సు పాస్ పాస్ సౌకర్యం తో పాటు టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని, సీనియర్ సిటిజన్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జర్నలిస్ట్ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ కు మరో వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంథని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, కోశాధికారి తగరం రాజు, సహాయ కార్యదర్శి గంధం అంజి బాబు, సీనియర్ జర్నలిస్టు కొమురోజు చంద్రమోహన్, లక్కాకుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




