Sircilla: ఎస్‌ఐఆర్ ప్రక్రియ పక్కాగా నమోదు చేయాలి: సీఈవో

Sircilla: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో రాష్ట్ర సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Oct 2026 7:10 PM IST
Sircilla
X

Sircilla: ఎస్‌ఐఆర్ ప్రక్రియ పక్కాగా నమోదు చేయాలి: సీఈవో

రాజన్న సిరిసిల్ల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి అంశాన్ని పారదర్శకంగా, పక్కాగా నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు అడిగిన వెంటనే అందించేందుకు అవసరమైన రికార్డులు, ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం వంటి చర్యలకు సంబంధించి తగిన ధ్రువీకరణ పత్రాలు, ఆధారాలను తప్పనిసరిగా భద్రపరచాలని స్పష్టం చేశారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ వారం చివరి నాటికి ప్రక్రియను పూర్తి చేసేలా లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అనర్హమైనవిగా గుర్తించిన దరఖాస్తులకు సంబంధించి సరైన కారణాలు, అవసరమైన పత్రాలు, ఆధారాలను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల దరఖాస్తులను అనర్హమైనవిగా గుర్తించగా, వాటిలో 44 వేల దరఖాస్తులకు సంబంధించిన ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిశీలనతో పాటు పెండింగ్ పనులను నవంబర్ 5వ తేదీ నాటికి పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్‌ఓ), బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ) స్థాయిల్లో రికార్డులు, సంబంధిత పత్రాలను భౌతికంగా, ఆన్‌లైన్‌లో భద్రంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఓటరు జాబితాలో అర్హులైన వారి పేర్లు సక్రమంగా నమోదయ్యేలా, అనర్హుల పేర్ల తొలగింపు నిబంధనల ప్రకారం జరిగేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, తహసీల్దార్ జయంత్, ఎన్నికల విభాగం అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA