Ramagundam: సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఐఎన్‌టీయూసీ!

Ramagundam: సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ రామగుండంలో మండిపడ్డారు. ఐదు ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 4 Nov 2026 8:32 PM IST
Ramagundam
X

Ramagundam: సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఐఎన్‌టీయూసీ!

రామగుండము: సింగరేణి కార్మికుల కు సంబంధించిన దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులు, ఉద్యోగులు మరియు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం జాప్యం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ముఖ్యంగా కింది ఐదు ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

234 మంది అర్హులైన అభ్యర్థులకు కారుణ్య నియామకాలు: అవసరమైన ప్రక్రియలు పూర్తయినప్పటికీ నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్న 234 మంది అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలి.

NCWA ఉద్యోగులకు PERKSపై ఆదాయపు పన్ను మినహాయింపు: సింగరేణి ఎగ్జిక్యూటివ్‌లకు, కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) ఉద్యోగులకు వర్తిస్తున్న PERKSపై ఆదాయపు పన్ను మినహాయింపును NCWA ఉద్యోగులకు కూడా సమానంగా వర్తింపజేయాలి.

జనరల్ అసిస్టెంట్ ప్రమోషన్లు: నిర్ణీత అర్హతలు, నిబంధనల ప్రకారం 190/240 మస్టర్లు పూర్తి చేసిన అర్హులైన జనరల్ అసిస్టెంట్ ట్రైనీలకు వెంటనే ప్రమోషన్ ఉత్తర్వులు జారీ చేయాలి.

అలియాస్ పేర్ల సమస్యల పరిష్కారం: ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, వ్యక్తిగత వివరాల్లో ఉన్న అలియాస్ పేర్లు, పేర్లలోని వ్యత్యాసాలకు సంబంధించిన పెండింగ్ కేసులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలి.

ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహణ: కార్మికులు, ఉద్యోగుల వైద్యపరమైన సమస్యలను పరిష్కరించేందుకు మెడికల్ బోర్డు సమావేశాలను క్రమం తప్పకుండా ప్రతి నెలా నిర్వహించాలి.

ఈ సమస్యలపై ఐఎన్‌టీయూసీ తరఫున పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ యాజమాన్యం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంపై డా. జనక్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో, వాటి అమలులో యాజమాన్యం మరింత జాప్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్మికుల సంక్షేమం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ఐఎన్‌టీయూసీ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి, అన్ని పెండింగ్ సమస్యలపై తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డా. జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో RG-1 వైస్ ప్రెసిడెంట్ శ్రీ సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో INTUC జనరల్ సెక్రటరీ శ్రీ వికాస్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీ వడ్డేపల్లి దాస్, RG-3 వైస్ ప్రెసిడెంట్ శ్రీ కోట రవీందర్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి శేషా రత్నం, రీజినల్ జనరల్ సెక్రటరీ శ్రీ ఆరెపల్లి శ్రీనివాస్, మహిళా జనరల్ సెక్రటరీ శ్రీమతి లలిత శ్రీ, బ్రాంచ్ సెక్రటరీ శ్రీనివాస్, ఖాదర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM