Ramagundam: 55 మంది యువతకు పోలీసు కమిషనర్ కౌన్సెలింగ్!

Ramagundam: రామగుండంలో డ్రగ్స్ రహితం కోసం సీపీ అంబర్ కిషోర్ ఝా ఎన్డీపీఎస్ కేసులపై సమీక్షించారు. గంజాయికి బానిసైన 55 మంది యువతకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 Oct 2026 7:19 PM IST
Ramagundam
X

Ramagundam: 55 మంది యువతకు పోలీసు కమిషనర్ కౌన్సెలింగ్!

Ramagundam: గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడంతో పాటు వాటి సరఫరా మూలాలను సమూలంగా ఛేదించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులను ఆదేశించారు. గంజాయి విక్రయించే పెడ్లర్లను గుర్తించి కేసులు నమోదు చేయడానికే పరిమితం కాకుండా, వారికి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ప్రధాన వ్యక్తులు, రవాణా మార్గాలు, ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌ను మాదకద్రవ్య రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఈగిల్ టీమ్) ఎస్పీ గిరిధర్‌తో కలిసి కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎన్డీపీఎస్ (NDPS) కేసులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల పురోగతి, పెండింగ్ కేసులు, దర్యాప్తు స్థితిగతులు, నిందితుల కార్యకలాపాలు, గంజాయి సరఫరా మార్గాలపై సమీక్షించారు. పెండింగ్ కేసులకు గల కారణాలను తెలుసుకుని, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

పెడ్లర్ల నుంచి ప్రధాన సరఫరాదారుల వరకు నిఘా

గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా వ్యవస్థను పూర్తిగా ఛేదించడమే లక్ష్యంగా పనిచేయాలని ఈగిల్ టీమ్ ఎస్పీ గిరిధర్ సూచించారు. పెడ్లర్లకు మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటిని ఎవరు సరఫరా చేస్తున్నారు? ఏ మార్గాల్లో రవాణా చేస్తున్నారు? అనే అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. సరఫరా గొలుసులోని ప్రతి స్థాయిని గుర్తించి, ప్రధాన నెట్‌వర్క్‌ను ఛేదించేలా చర్యలు చేపట్టాలన్నారు.

అనుమానాస్పద వ్యక్తులు, ప్రాంతాలు, రవాణా మార్గాలపై నిరంతర నిఘా కొనసాగించాలని, సాక్ష్యాధారాల సేకరణ, నిందితుల గుర్తింపు, కేసుల దర్యాప్తులో వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు.

అక్రమ ఆస్తులపై చట్టపరమైన చర్యలు

మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి, ఎన్డీపీఎస్ చట్ట నిబంధనల ప్రకారం వాటిని సీజ్ లేదా ఫ్రీజ్ చేసేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. డ్రగ్స్ నిర్మూలన కేవలం కేసులు నమోదు చేయడంతో పూర్తికాదని, సరఫరా మూలాలను ఛేదించడం, వినియోగదారులకు కౌన్సెలింగ్ అందించడం, యువతలో అవగాహన కల్పించడం కూడా కీలకమని పేర్కొన్నారు.

ప్రజల నుంచి మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై అందే సమాచారాన్ని ప్రాధాన్యతతో పరిశీలించాలని, సమాచారదాతల వివరాలను గోప్యంగా ఉంచుతూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లు, టాస్క్‌ఫోర్స్, ఈగిల్ టీమ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

55 మంది యువతకు కౌన్సెలింగ్

మాదకద్రవ్యాల బారినపడిన యువతను తిరిగి సాధారణ జీవనంలోకి తీసుకురావడంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి వినియోగానికి అలవాటుపడిన 55 మంది యువతతో సీపీ అంబర్ కిషోర్ ఝా, ఈగిల్ టీమ్ ఎస్పీ గిరిధర్ మాట్లాడి కౌన్సెలింగ్ అందించారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని యువతకు సీపీ సూచించారు. చెడు స్నేహాలు, ఒత్తిడి, తాత్కాలిక ఆకర్షణల కారణంగా వ్యసనాలకు అలవాటుపడిన వారు వాటి నుంచి బయటపడేందుకు కృషి చేయాలని, అవసరమైతే పునరావాస సహాయం పొందాలని తెలిపారు.

మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యంతో పాటు కుటుంబం, విద్య, ఉపాధి, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. యువత తమ శక్తి సామర్థ్యాలను సానుకూల దిశలో వినియోగించుకుంటూ విద్య, సాంకేతిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల దిశగా అవసరమైన సహకారం అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

“వ్యసనాలకు దూరంగా ఉండండి.. మీ జీవితాన్ని మీరే మార్చుకోండి. మంచి పౌరులుగా ఎదిగి కుటుంబానికి గర్వకారణంగా నిలవండి” అని సీపీ యువతకు దిశానిర్దేశం చేశారు. అవసరమైన వారికి సంబంధిత శాఖల సమన్వయంతో నిరంతర సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై అందే సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి, సంబంధిత నెట్‌వర్క్‌పై ఏకకాలంలో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను నిర్మూలించేందుకు నిరంతర చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, జైపూర్ ఏసీపీ ఆర్. వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, ఈగిల్ ఫోర్స్ కరీంనగర్ ఆర్‌ఎన్‌సీసీ డీఎస్పీ ఎస్. ఉపేందర్, నిజామాబాద్ ఆర్‌ఎన్‌సీసీ డీఎస్పీ సోమనాథ్, హైదరాబాద్ ఆర్‌ఎన్‌సీసీ డీఎస్పీ పుష్పకుమార్‌తో పాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.