Ramagundam: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా!

Ramagundam: రామగుండం కమిషనరేట్‌లో సీపీ అంబర్ కిషోర్ ఝా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 13 Oct 2026 9:11 PM IST
Ramagundam
X

Ramagundam: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా!

రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ కార్యాలయంలో సెప్టెంబర్ నెల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్, డివిజన్,జోన్ వారీగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ,చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాల్లో కేసుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ అధికారి స్టేషన్‌లో అందుబాటులో ఉంటూ నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని, చట్టప్రకారం నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేసే అధికారులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు.

ప్రతి ఎస్‌హెచ్‌ఓ తన సిబ్బంది పనితీరు, ప్రవర్తన,కదలికలపై నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని ఆదేశించారు.నేర సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నచిన్న విషయాలపై కూడా పోలీసులకు సమాచారం అందేలా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట కేసులు నమోదు చేసి, సంఘటనా స్థలాన్ని సందర్శించి, వీడియో రికార్డింగ్, సాక్షుల విచారణ, సాక్ష్యాధారాల సేకరణ ద్వారా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. సరైన చట్టపరమైన కారణం లేకుండా ఎవరినీ పోలీస్ స్టేషన్‌కు పిలవరాదని స్పష్టం చేశారు.నైట్ పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేసి,అధికారులు, బ్లూ కోల్ట్స్,పెట్రోల్ కార్ సిబ్బంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్‌డీపీఎస్,నకిలీ విత్తనాల కేసుల్లో నిందితులపై చట్టప్రకారం పీడీ యాక్ట్ అమలుకు చర్యలు చేపట్టాలని, నేరాల ద్వారా సంపాదించిన ఆస్తుల స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి అక్రమ సరఫరా, రవాణా, వినియోగంతో పాటు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, గుడుంబా తయారీ, అక్రమ ఇసుక రవాణా, పేకాట తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా పెంచి, తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని,వాహన తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

తీవ్రమైన నేరాలు, పోక్సో,ఎస్సీ,ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు.ప్రాపర్టీ నేరాలు,చైన్ స్నాచింగ్, దొంగతనాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, నిందితులను త్వరగా పట్టుకునేందుకు సీసీఎస్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మహిళలు,బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని,లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తును నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆదేశించారు.

డీజీపీ, సీసీసీ పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లను కూడా త్వరితగతిన విచారించాలని సూచించారు. ఫిర్యాదు వాస్తవమని తేలితే కేసు నమోదు చేయాలని,తప్పుడు ఫిర్యాదుల విషయంలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM