Ramagundam: ఏజెన్సీలో ఎస్సీలకూ సమాన హక్కులు కల్పించాలి: నగేష్!

Ramagundam: 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలతో పాటు ఎస్సీలకూ భూమి, సంక్షేమ హక్కులు కల్పించాలని రామగుండంలో ఏజెన్సీ ఎస్సీల ఐక్యవేదిక కన్వీనర్ దుర్గం నగేష్ డిమాండ్ చేశారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 3 Nov 2026 5:49 PM IST
Ramagundam
X

Ramagundam: ఏజెన్సీలో ఎస్సీలకూ సమాన హక్కులు కల్పించాలి: నగేష్!

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం స్నేహ సాహితీ గంధాలయంలో నిర్వహించిన రైతు సమావేశంలో పలు సంఘ నాయకులు పాల్గొని రైతు సమస్యలపై చర్చించారు . ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల ప్రజలకు గిరిజనులతో సమానంగా అభివృద్ధి, భద్రత, జీవనోపాధి అవకాశాలు కల్పించాలని ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ మార్షల్ దుర్గం నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు స్నేహ సాహితి గ్రంథాలయంలో రైతు సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన రైతు సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 17, 21లు సమానత్వం, వివక్ష నిషేధం, అంటరానితనం నిర్మూలన, గౌరవప్రదమైన జీవన హక్కులను కల్పించాయని వివరించారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో అమలవుతున్న 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం, పీసా చట్టం-1996, అటవీ హక్కుల చట్టం-2006 గిరిజనుల హక్కుల పరిరక్షణలో కీలకమని పేర్కొన్నారు. అదే ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీలకు కూడా భూమి, ఇళ్ల స్థలాలు, విద్య, ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో ప్రత్యేక రక్షణలు, సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

గిరిజనులకు కల్పించిన రాజ్యాంగపరమైన హక్కులను తగ్గించడం తమ ఉద్దేశం కాదని, ఎస్టీల హక్కులు కొనసాగుతూనే ఎస్సీలకు కూడా న్యాయబద్ధమైన హక్కులు అందాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎస్టీలకు వర్తించే 1/70, పీసా చట్టాలను ఎస్సీలకు యథాతథంగా వర్తింపజేయాలంటే చట్టపరమైన మార్పులు అవసరమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందినప్పుడే అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, పర్యావరణ పరిరక్షణ అధ్యక్షుడు దహేగామ ఉమామహేశ్వరరావు, సామాజిక కార్యకర్తలు ఎరుకల రాజన్న, పోరెడ్డి వెంకన్న, బాలన్న, పొన్నం విజయకుమార్ గౌడ్, న్యూ ఇండియా పార్టీ నాయకులు జి.వి. రాజు, వేముల అశోక్, పుట్ట రాజన్న తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM