Yellareddypet: వేణుగోపాల స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్!
Yellareddypet: ఎల్లారెడ్డిపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రథోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు.
Yellareddypet: వేణుగోపాల స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్!
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రథోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణం, లోకశాంతి కోసం ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో ఎలాంటి కీడు జరగకుండా, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సనాతన ధర్మం, హైందవ సంస్కృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎల్లారెడ్డిపేటలోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయ జీర్ణోద్ధరణ, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయ పునరుద్ధరణ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి రూ.2 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కూడా నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్తీక పౌర్ణమి పవిత్ర రోజున వేణుగోపాల స్వామి రథోత్సవం జరగడం శుభపరిణామమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.




