Sircilla: ఓటరు నమోదుకు ఈ నెల 21 వరకు గడువు CEO సుదర్శన్ రెడ్డి
Sircilla: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ–2026లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల 21 వరకు అవకాశం కల్పించిన రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డి.
Sircilla: ఓటరు నమోదుకు ఈ నెల 21 వరకు గడువు CEO సుదర్శన్ రెడ్డి
సిరిసిల్ల: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ–2026 (SIR) ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 21వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించవచ్చని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.
SIR ప్రక్రియ, ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన ఓటర్ల వివరాలపై శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు మరోసారి ఫారాలు అందించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం తదితర కారణాలతో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఇప్పటికే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల వారీగా ASD జాబితాల ప్రదర్శన
గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన (ASD) ఓటర్ల వివరాలను పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాల రూపంలో ప్రదర్శించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశించారు. ఓటరు జాబితాలో పేర్లు చేర్చకపోవడానికి గల కారణాలను కూడా స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ఈ జాబితాలను ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచాలని తెలిపారు.
ఓటర్లు తమ పాత EPIC నంబర్ ఆధారంగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లేదా ECI NET యాప్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని సమర్పించవచ్చని వెల్లడించారు. ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తహసీల్దార్లు మహేష్, జయంత్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.




