Sircilla: వేములవాడలో ఘనంగా 6వ రోజు బతుకమ్మ సంబురాలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 6వ రోజు బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. సప్తమాతృకల ఆచారంతో ఇక్కడ 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకోవడం విశేషం.
Sircilla: వేములవాడలో ఘనంగా 6వ రోజు బతుకమ్మ సంబురాలు!
వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం మహిళలు, చిన్నారులు ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉత్సాహంగా ఆడారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా తీరొక్క పూలతో బతుకమ్మలను సుందరంగా అమర్చారు.
పట్టణంలోని బైపాస్ రోడ్డు, కూరగాయల మార్కెట్ పరిసరాల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మలను పేర్చి, తమ వాకిళ్లలో వాటి చుట్టూ చేరి భక్తి గీతాలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం కాలనీల కూడళ్లలో ఉత్సాహంగా కోలాటాలు ఆడుతూ పండుగ వాతావరణాన్ని తలపించారు. శ్రీ భీమేశ్వర ఆలయం పక్కన ఉన్న భీమేశ్వర సదన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్ప వద్ద మహిళలు పూలతో ప్రత్యేక పూజలు చేసి, బతుకమ్మలు ఆడి నీటిలో నిమజ్జనం చేశారు. ఈ వేడుకలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి.
ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ.. వేములవాడ విశిష్టత
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరిపితే, వేములవాడలో మాత్రం కేవలం ఏడు రోజులకే 'సద్దుల బతుకమ్మ'ను ముగించడం ఇక్కడి ప్రత్యేకత. వేద పండితుల సూచనల ప్రకారం సప్తమాతృకల (బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి) పేర్ల మీదుగా ఇక్కడ ఏడు రోజులే ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
వేములవాడలో ఏడో రోజే సద్దుల బతుకమ్మ ముగుస్తుండటంతో, ఇక్కడి మహిళలకు పుట్టింటితో పాటు మెట్టినింటిలోనూ రెండు చోట్లా బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కుతుంది. ఈ ప్రత్యేక సాంప్రదాయాన్ని వేములవాడ మహిళలు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు.




