Sircilla: జానపద కళాకారులకు అండగా ఉంటా: కేంద్ర మంత్రి బండి!
Sircilla: సిరిసిల్లలో నవంబర్ 1న జరగనున్న తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు హాజరుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు నిర్వాహకులు ఆహ్వాన పత్రం అందజేశారు.
Sircilla: జానపద కళాకారులకు అండగా ఉంటా: కేంద్ర మంత్రి బండి!
సిరిసిల్ల: సిరిసిల్లలో నవంబర్ 1న నిర్వహించనున్న తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు హాజరుకావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్శి, కన్వీనర్ ఎండీ సత్తార్ బాయ్ ఆహ్వానించారు. కరీంనగర్‌లోని మహాలక్ష్మి ఆలయంలో ఈరోజు మంత్రిని కలిసి వేడుకలకు ఆహ్వాన పత్రం అందజేశారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా జానపద కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సినిమా రంగానికి దీటుగా జానపద కళాకారులు తమ పాటల ద్వారా ప్రతిభను చాటుకుంటూ నూతన పాటలను రూపొందిస్తున్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సినిమా రంగానికి అందిస్తున్న విధంగానే జానపద కళారంగానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందించేలా కృషి చేయాలని కోరారు. ఆవిర్భావ వేడుకలకు హాజరై జానపద కళాకారులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు జానపద కళాకారులు నాయకులకు, వ్యాపారులకు ప్రచారం కల్పిస్తూ వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అయితే కళాకారులు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదనే విషయం తనకు తెలుసని పేర్కొన్నారు. జానపద కళాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని, సిరిసిల్లలో జరిగే తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ, తెలుగు ఫోక్ అసోసియేషన్ ప్రచార కార్యదర్శి ఆకునూరి దేవయ్య, సభ్యులు సాంబారి నవీన్, నక్క శ్రీకాంత్, విశ్వరాజు మహేష్, గుండేటి రమేష్, బుర్ర సతీష్ గౌడ్, పొద్దుపొడుపు శంకర్, తేలు విజయ, వంకాయల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.




