Illanthakunta: ఇల్లంతకుంట జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల స్మార్ట్ గ్లౌజ్‌కు జాతీయ గుర్తింపు!

Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట జెడ్పీ పాఠశాల విద్యార్థినులు రేష్మ, సహస్ర రూపొందించిన 'స్మార్ట్ గ్లౌజ్' ప్రాజెక్టు జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది.

KALEEM, SIRICILLA
Published on: 23 Nov 2026 2:48 PM IST
Illanthakunta
X

Illanthakunta: ఇల్లంతకుంట జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల స్మార్ట్ గ్లౌజ్‌కు జాతీయ గుర్తింపు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు వడ్నాల రేష్మ, పండుగ సహస్ర రూపొందించిన 'స్మార్ట్ గ్లౌజ్' ప్రాజెక్టు జాతీయ స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. పక్షవాతంతో పాటు ఇతర కారణాలతో మాట్లాడలేని వారికి ఉపయోగపడేలా రూపొందించిన ఈ వినూత్న పరికరం సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్-2026లో ద్వితీయ స్థానం సాధించి జాతీయ స్థాయికి చేరుకుంది.

ప్రస్తుతం కరీంనగర్ డైట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న వి. మహేష్ చంద్ర మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టును రూపొందించారు. గతంలో కొల్లూరులోని గాడియం స్కూల్‌లో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో విశేష ప్రతిభ కనబరిచి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో డిసెంబర్ 14 నుంచి 19వ తేదీ వరకు పుదుచ్చేరిలో నిర్వహించనున్న 53వ జాతీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన మూడు ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడం విశేషం.

ఈ స్మార్ట్ గ్లౌజ్‌ను చేతికి ధరించడం ద్వారా మాట్లాడలేని వ్యక్తులు తమ అవసరాలను ఇతరులకు తెలియజేయవచ్చు. గ్లౌజ్‌లో అమర్చిన ప్రత్యేక సెన్సార్ల సహాయంతో చేతి వేళ్ల కదలికలను గుర్తించి, వాటికి అనుగుణంగా సందేశాలను మానిటర్‌పై ప్రదర్శించడంతో పాటు లౌడ్ స్పీకర్ ద్వారా వినిపిస్తుంది. అంతేకాకుండా సంబంధిత వ్యక్తులకు మెసేజ్ రూపంలో వారి లొకేషన్‌తో సహా సమాచారం చేరవేస్తుంది. పేషెంట్ ఆరోగ్య వివరాలను ప్రత్యేక అప్లికేషన్‌లో నమోదు చేస్తే ఆరోగ్య నివేదికతో పాటు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేస్తుంది.

ఇళ్లలో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నవారితో పాటు ఆసుపత్రుల్లోని ఐసీయూ రోగులకు కూడా ఈ పరికరం ఉపయోగపడే అవకాశం ఉంది. రోగులు తమ అవసరాలను సెన్సార్ల ద్వారా నర్సులకు తెలియజేయడం వల్ల సకాలంలో వైద్య సేవలు, అవసరమైన సహాయం అందించేందుకు దోహదపడుతుంది.

ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై జిల్లా విద్యాశాఖ అధికారి విద్యాసాగర్, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, జిల్లా సెక్టోరియల్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ మామిడి రాజు, ప్యాక్స్ చైర్మన్ వి. రమణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతగిరి సాహిత్య, వినయ్ కుమార్, ఉప సర్పంచ్ నాగరాజు శర్మ, వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు విద్యార్థినులను, మార్గదర్శకులను అభినందించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA