Sircilla: నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Nov 2026 2:30 PM IST
Sircilla
X

Sircilla: నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు విక్రయించినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచూ నకిలీ విత్తనాల కేసుల్లో పట్టుబడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

శనివారం పోలీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, లైసెన్సులు, నిల్వలు, బిల్లులు, రసీదులను క్షుణ్ణంగా పరిశీలించారు.

గతంలో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. నాణ్యతపై అనుమానం ఉన్నా, నకిలీ విత్తనాలు లేదా పురుగుమందులు విక్రయిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రైతులను నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల బారి నుంచి రక్షించేందుకు జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA