Sircilla: సైబర్ మోసాలు, ర్యాగింగ్, డ్రగ్స్ పట్ల విద్యార్థులు జాగ్రత్త: ఎస్పీ!
Sircilla: సిరిసిల్ల మెడికల్ కాలేజీ విద్యార్థులు సైబర్ నేరాలు, ర్యాగింగ్, మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.
Sircilla: సైబర్ మోసాలు, ర్యాగింగ్, డ్రగ్స్ పట్ల విద్యార్థులు జాగ్రత్త: ఎస్పీ!
సిరిసిల్ల: డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో పరిచయమైన అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. వైద్య విద్యార్థులు ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ వైద్యులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
మంగళవారం జిల్లా పరిధిలోని మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ పాల్గొని సైబర్ నేరాలు, ర్యాగింగ్, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో గంజాయి, ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మవద్దని, అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, కుటుంబ సమాచారం, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలు, బహుమతుల ఆశలు, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ గేమింగ్, డిజిటల్ అరెస్ట్ వంటి పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
కళాశాలల్లో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో విద్యను అభ్యసించాలని, ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు కళాశాలలోని యాంటీ ర్యాగింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని, తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ప్రవర్తనపై కళాశాల యాజమాన్యం నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని సూచించారు.
వైద్య విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కష్టపడి చదివి ఉత్తమ వైద్యులుగా ఎదగాలని, కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థినుల భద్రత కోసం జిల్లా షీ టీం పనిచేస్తోందని, వేధింపులు ఎదురైతే 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అనంతరం వైద్య విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ స్కిట్ ప్రదర్శించి తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, అధ్యాపకులు, సైబర్ ఆర్‌ఎస్‌ఐ జునైద్, సైబర్ సిబ్బంది గంగారెడ్డి, మహేష్, కిట్టు, అభిషేక్, విజయ్‌తో పాటు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.




