Sircilla: సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు: డీఎంహెచ్‌ఓ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జ్వరాలున్న గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 13 Oct 2026 6:04 PM IST
Sircilla
X

Sircilla: సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు: డీఎంహెచ్‌ఓ!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. జిల్లాలో జ్వరాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, జ్వరాలు నమోదవుతున్న గ్రామాల్లో రక్త నమూనాలను సేకరించి, పరీక్షలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ల్యాబొరేటరీ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మలేరియా తదితర సీజనల్ వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, బాధితులకు అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. జ్వరాలు అధికంగా నమోదవుతున్న గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని తెలిపారు.

వసతి గృహాల్లో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జ్వరాలు, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి యాంటీ లార్వల్ చర్యలతో పాటు దోమల నియంత్రణ చర్యలను నిరంతరం చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సీజనల్ వ్యాధులపై నిరంతర నిఘా కొనసాగించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.

ఈ సమావేశంలో ఎన్‌వీబీడీసీపీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిప్యూటీ డెమో ప్రసాద్, సబ్ యూనిట్ ఆఫీసర్ రామనాథం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మోహన్, ఎంపీహెచ్‌ఈఓ రాజుతో పాటు జిల్లాలోని ల్యాబొరేటరీ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA