Sircilla: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: అదనపు కలెక్టర్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ రహదారి పనులను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Oct 2026 10:24 PM IST
Sircilla
X

Sircilla: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: అదనపు కలెక్టర్!

సిరిసిల్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న రహదారుల మరమ్మతు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, పెండింగ్ రహదారి పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని రగుడు జంక్షన్, నాంపల్లి జంక్షన్ వద్ద రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. చీర్లవంచ–వల్లంపట్ల రహదారి, వేములవాడ రెండో బైపాస్ రోడ్డు సహా జిల్లాలోని పలు రహదారులకు అవసరమైన మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల సమీపంలో అవసరమైన చోట రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

విద్యార్థులను తరలించే పాఠశాల ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రవాణా నిబంధనల ఉల్లంఘనలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రవాణా, పోలీసు, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

పీఎం రహత్ పథకం ద్వారా అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో నగదు రహిత వైద్య చికిత్స అందేలా పోలీసు, రవాణా, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వైద్య సహాయం అందించడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన పనులకు మంజూరు వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు అదనపు కలెక్టర్‌కు వివరించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశించిన పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో జాతీయ రహదారుల ఈఈ సురేష్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఆర్టీసీ డీఎంలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA